Saturday, July 24, 2010

అమ్మా - నాన్న (కథ)

అమ్మా-నాన్న

నాన్నంటే నాకు చాలా ఇష్టం. కటిక చీకటిలో, అడవి దారిలో నా చేయి పట్టుకుని వెలుగు రేకల వైపు నిబ్బరంగా నడిపించుకు పోయిన దేవుడు మా నాన్న.

నాకు చదువంటే ఇష్టం లేదు. పక్కింటి సౌదామినితో కలిసి తొక్కుడు బిళ్ళ ఆడుకోవడంలో నాకెంతో ఆనందం. ఊరి చివర మామిడి తోపులోకి జొరబడి, తోటమాలి బట్టతల మీద బొప్పి కట్టేలా ఉండేలు బద్దతో గురి చూసి కొట్టి, వాడు కుయ్యో మొర్రో అని గోల పెడుతూంటే, నవ్వుకుంటూ, అందినన్ని లేత మామిడికాయలు కోసుకొచ్చి, శ్రధ్ధగా ముక్కలు తరిగి, ఉప్పు, కారం అద్ది, సౌదామినికి తినిపిస్తూంటే నాకు మహదానందం.

అటువంటి నన్ను తిట్టకుండా, కొట్టకుండా, అమ్మ నా చెవి మెలి పెట్టబోతే అడ్డుకుని, ఆవిడ నన్ను బెత్తంతో కొట్టబోతోంటే, తన చెయ్యి అడ్డు పెట్టి, ఆ దెబ్బ తను తిని, నన్ను గుండెలకి హత్తుకుని, లాలిస్తూ, ముద్దులాడుతూ, మంచి బుధ్ధులంటే ఏమిటి, చదువుకుంటే కలిగే లాభాలేమిటి, జులాయిగా తిరుగుతే భవిష్యత్తులో కలిగే నష్టాలేమిటి అన్నది నా చిన్న మనసుకు హత్తుకునేలా బోధించిన మహానుభావుడు మా నాన్న. నేను బడికి వెళ్ళనని పేచీ పెడితే, నాకు నచ్చజెప్పి, "ఔటుబెల్లు కొట్టినప్పుడు బొంబాయి మిఠాయి కొనుక్కోరా నాన్నా" అంటూ నా చేతిలో రెండు కానులు తన చిరుగుల చిక్కాకున్న జేబులోంచి తీసి నా చేతులో వుంచేవాడు మా నాన్న.

బొంబాయి మిఠాయితో చేసిన రిష్టువాచి ఖరీదు ఒక కాని. సైకిలు ఖరీదు రెండు కానులు. నాకు బొంబాయి మిఠాయితో చేసిన సైకిలంటేనే ఇష్టం. ఒక్కొక్క చక్రం, తర్వాత హేండిలుబారు - అన్నీ నోటితో తెంపుకుని తింటూంటే, వారెవా! ఎంత ఆనందం!!

సాయంత్రం స్కూలు అయిపోయాక ఆడుకుని ఇంటికొచ్చేసరికి, మా అమ్మ నన్ను కేకలెయ్యబోతుంటే, మళ్ళీ నన్ను గుండెలకి హత్తుకుని, "ఇవాళ బళ్ళో ఏం చెప్పార్రా?" అంటూ నన్ను కబుర్లలోకి దింపి, నాకు గోరుముద్దలు తినిపిస్తూ, తరవాత నన్ను చదివిస్తూ, నన్ను పడుకోబెట్టేవాడు మా నాన్న.

కాని నాకు నిద్ర వచ్చేది కాదు. ఐనా నిద్ర నటించే వాణ్ణి. నేను పడుకున్నాను అనుకున్నాక, మా నాన్న అమ్మ దగ్గరకి మెల్లగా వెళ్ళేవాడు. ఆవిడ కాళ్ళకి కొబ్బరి నూనె రాసుకుంటూంటే, "ఉండవే అలివేలూ! నేను రాసి నీ కాళ్ళు వత్తుతాను." అంటూ అమ్మ పాదాలకి నూనె రాసేవాడు.

అమ్మ, "వద్దు మావా! నువ్వు పగలంతా రిక్షా తొక్కి వచ్చావు. నేనే నీ కాళ్ళు వత్తుతాను" అంటూంటే, "కాదులే అలివేలూ! పది రూపాయల జీతం కోసం అయ్యోరింటిలో అడ్డమైన చాకిరీ చేసి, అమ్మగారి పాదాలు నొక్కడం లాంటివన్నీ చేసి, అలిసిపోయి ఇంటికొస్తావు. మళ్ళీ ఇక్కడ కూడా నాకోసం, బుడ్డోడి కోసం వణ్ణం వండడం దగ్గర్నించీ అడ్డమైన సేవలూ సేత్తావు. నీకో సీరముక్కన్నా కొనిపెట్టలేని ఎదవని. ఐనా పేమతో నన్ను అక్కున జేర్చుకుని, నా ఒంటికి, మనసుకి సమ్మ కలిగిత్తావు. నీ ఋణం ఎట్టా తీరుద్దే అలివేలూ?" అంటూ ఆవిడ కాళ్ళు వత్తుతాడు.

అది చూస్తే నాకేడుపు వచ్చేది. ఇవ్వడమే కాని తీసుకోవడం ఎరగని ఉదారుడాయన. "నాన్నా! నీకోసం నేను పెద్ద చదువులు చదువుతాను. నేను కలెక్టరవుతా నాన్నా" అని ఏడుస్తూ, పుస్తకాలు ఎదర వేసుకుని చదివే వాణ్ణి.

రోజులు గడిచాయి. నెలలు గడిచాయి. సంవత్సరాలు గడిచాయి. రిక్షా తొక్కే మా నాన్న, పాచి పనులు చేసే మా అమ్మ ఆశయాలకి అనుగుణంగా నేనీ రోజు ఐ.ఏ.యస్. ఆఫీసరయ్యాను. ఎక్కడ అవినీతి జరుగుతున్నా పరశురాముడి గొడ్డలితో నరికేస్తున్నా.

"అయ్యబాబోయ్! కొండయ్యగారా! ఆయన ఐ.ఏ.యస్. ఆఫీసరు కాదురా!, పరశురాముడి గొడ్డలిరా!" అని దొంగనాయాళ్ళందరూ బట్టలు తడుపుకునేలా విజృంభిస్తున్నా. "సమాజానికి కొండయ్యలాంటి వాళ్ళే కావాలి" అని పత్రికలు, మీడియాలు కోడై కూసేలా చెలరేగి పోతున్నా.

ఈరోజు నాకు జీతం వేలు వేలు వస్తోంది. ఎ.సి.భవనాలలో, ఇండికా కార్లలో నా రోజులు గడుస్తున్నాయి. నాన్న నాకు బొంబాయి మిఠాయి కొనుక్కోడానికి ఇచ్చిన రెండేసి కాన్లకి బదులుగా, నాన్నకి వెయ్యి రూపాయల నోట్లు, అమ్మ వెట్టి చాకిరీ చేస్తూ గడిపిని జీవితానికి ప్రతిగా ఆవిడకి పట్టుచీరలు కొనగలిగిన తాహతులో బతుకుతున్నా. కాని అమ్మకి పట్టుచీరలు కొనాలన్నా, నాన్నకి వెయ్యి రూపాయల నోట్ల కట్టలు ఇవ్వాలన్నా నాకిప్పుడు కుదరదు. బ్రహ్మాండమైన భవంతి కట్టుకున్నాను. పిల్లల్ని ఫారిన్ లో చదివిస్తున్నాను.

నా చిన్నప్పుడు నా చేతుల్లో డబ్బు లేదు. కాని అమ్మా, నాన్న వున్నారు. ఇప్పుడు నా చేతినిండా డబ్బే డబ్బు. కాని అమ్మా, నాన్న లేరు! ఎప్పుడో, ఏనాడో నేను కలెక్టరు ట్రయినింగులో వుండగానే వాళ్ళిద్దరూ కన్ను మూసారు!.

(This story was published in Navya weekly)

No comments:

Post a Comment