Saturday, July 24, 2010

అమ్మా - నాన్న (కథ)

అమ్మా-నాన్న

నాన్నంటే నాకు చాలా ఇష్టం. కటిక చీకటిలో, అడవి దారిలో నా చేయి పట్టుకుని వెలుగు రేకల వైపు నిబ్బరంగా నడిపించుకు పోయిన దేవుడు మా నాన్న.

నాకు చదువంటే ఇష్టం లేదు. పక్కింటి సౌదామినితో కలిసి తొక్కుడు బిళ్ళ ఆడుకోవడంలో నాకెంతో ఆనందం. ఊరి చివర మామిడి తోపులోకి జొరబడి, తోటమాలి బట్టతల మీద బొప్పి కట్టేలా ఉండేలు బద్దతో గురి చూసి కొట్టి, వాడు కుయ్యో మొర్రో అని గోల పెడుతూంటే, నవ్వుకుంటూ, అందినన్ని లేత మామిడికాయలు కోసుకొచ్చి, శ్రధ్ధగా ముక్కలు తరిగి, ఉప్పు, కారం అద్ది, సౌదామినికి తినిపిస్తూంటే నాకు మహదానందం.

అటువంటి నన్ను తిట్టకుండా, కొట్టకుండా, అమ్మ నా చెవి మెలి పెట్టబోతే అడ్డుకుని, ఆవిడ నన్ను బెత్తంతో కొట్టబోతోంటే, తన చెయ్యి అడ్డు పెట్టి, ఆ దెబ్బ తను తిని, నన్ను గుండెలకి హత్తుకుని, లాలిస్తూ, ముద్దులాడుతూ, మంచి బుధ్ధులంటే ఏమిటి, చదువుకుంటే కలిగే లాభాలేమిటి, జులాయిగా తిరుగుతే భవిష్యత్తులో కలిగే నష్టాలేమిటి అన్నది నా చిన్న మనసుకు హత్తుకునేలా బోధించిన మహానుభావుడు మా నాన్న. నేను బడికి వెళ్ళనని పేచీ పెడితే, నాకు నచ్చజెప్పి, "ఔటుబెల్లు కొట్టినప్పుడు బొంబాయి మిఠాయి కొనుక్కోరా నాన్నా" అంటూ నా చేతిలో రెండు కానులు తన చిరుగుల చిక్కాకున్న జేబులోంచి తీసి నా చేతులో వుంచేవాడు మా నాన్న.

బొంబాయి మిఠాయితో చేసిన రిష్టువాచి ఖరీదు ఒక కాని. సైకిలు ఖరీదు రెండు కానులు. నాకు బొంబాయి మిఠాయితో చేసిన సైకిలంటేనే ఇష్టం. ఒక్కొక్క చక్రం, తర్వాత హేండిలుబారు - అన్నీ నోటితో తెంపుకుని తింటూంటే, వారెవా! ఎంత ఆనందం!!

సాయంత్రం స్కూలు అయిపోయాక ఆడుకుని ఇంటికొచ్చేసరికి, మా అమ్మ నన్ను కేకలెయ్యబోతుంటే, మళ్ళీ నన్ను గుండెలకి హత్తుకుని, "ఇవాళ బళ్ళో ఏం చెప్పార్రా?" అంటూ నన్ను కబుర్లలోకి దింపి, నాకు గోరుముద్దలు తినిపిస్తూ, తరవాత నన్ను చదివిస్తూ, నన్ను పడుకోబెట్టేవాడు మా నాన్న.

కాని నాకు నిద్ర వచ్చేది కాదు. ఐనా నిద్ర నటించే వాణ్ణి. నేను పడుకున్నాను అనుకున్నాక, మా నాన్న అమ్మ దగ్గరకి మెల్లగా వెళ్ళేవాడు. ఆవిడ కాళ్ళకి కొబ్బరి నూనె రాసుకుంటూంటే, "ఉండవే అలివేలూ! నేను రాసి నీ కాళ్ళు వత్తుతాను." అంటూ అమ్మ పాదాలకి నూనె రాసేవాడు.

అమ్మ, "వద్దు మావా! నువ్వు పగలంతా రిక్షా తొక్కి వచ్చావు. నేనే నీ కాళ్ళు వత్తుతాను" అంటూంటే, "కాదులే అలివేలూ! పది రూపాయల జీతం కోసం అయ్యోరింటిలో అడ్డమైన చాకిరీ చేసి, అమ్మగారి పాదాలు నొక్కడం లాంటివన్నీ చేసి, అలిసిపోయి ఇంటికొస్తావు. మళ్ళీ ఇక్కడ కూడా నాకోసం, బుడ్డోడి కోసం వణ్ణం వండడం దగ్గర్నించీ అడ్డమైన సేవలూ సేత్తావు. నీకో సీరముక్కన్నా కొనిపెట్టలేని ఎదవని. ఐనా పేమతో నన్ను అక్కున జేర్చుకుని, నా ఒంటికి, మనసుకి సమ్మ కలిగిత్తావు. నీ ఋణం ఎట్టా తీరుద్దే అలివేలూ?" అంటూ ఆవిడ కాళ్ళు వత్తుతాడు.

అది చూస్తే నాకేడుపు వచ్చేది. ఇవ్వడమే కాని తీసుకోవడం ఎరగని ఉదారుడాయన. "నాన్నా! నీకోసం నేను పెద్ద చదువులు చదువుతాను. నేను కలెక్టరవుతా నాన్నా" అని ఏడుస్తూ, పుస్తకాలు ఎదర వేసుకుని చదివే వాణ్ణి.

రోజులు గడిచాయి. నెలలు గడిచాయి. సంవత్సరాలు గడిచాయి. రిక్షా తొక్కే మా నాన్న, పాచి పనులు చేసే మా అమ్మ ఆశయాలకి అనుగుణంగా నేనీ రోజు ఐ.ఏ.యస్. ఆఫీసరయ్యాను. ఎక్కడ అవినీతి జరుగుతున్నా పరశురాముడి గొడ్డలితో నరికేస్తున్నా.

"అయ్యబాబోయ్! కొండయ్యగారా! ఆయన ఐ.ఏ.యస్. ఆఫీసరు కాదురా!, పరశురాముడి గొడ్డలిరా!" అని దొంగనాయాళ్ళందరూ బట్టలు తడుపుకునేలా విజృంభిస్తున్నా. "సమాజానికి కొండయ్యలాంటి వాళ్ళే కావాలి" అని పత్రికలు, మీడియాలు కోడై కూసేలా చెలరేగి పోతున్నా.

ఈరోజు నాకు జీతం వేలు వేలు వస్తోంది. ఎ.సి.భవనాలలో, ఇండికా కార్లలో నా రోజులు గడుస్తున్నాయి. నాన్న నాకు బొంబాయి మిఠాయి కొనుక్కోడానికి ఇచ్చిన రెండేసి కాన్లకి బదులుగా, నాన్నకి వెయ్యి రూపాయల నోట్లు, అమ్మ వెట్టి చాకిరీ చేస్తూ గడిపిని జీవితానికి ప్రతిగా ఆవిడకి పట్టుచీరలు కొనగలిగిన తాహతులో బతుకుతున్నా. కాని అమ్మకి పట్టుచీరలు కొనాలన్నా, నాన్నకి వెయ్యి రూపాయల నోట్ల కట్టలు ఇవ్వాలన్నా నాకిప్పుడు కుదరదు. బ్రహ్మాండమైన భవంతి కట్టుకున్నాను. పిల్లల్ని ఫారిన్ లో చదివిస్తున్నాను.

నా చిన్నప్పుడు నా చేతుల్లో డబ్బు లేదు. కాని అమ్మా, నాన్న వున్నారు. ఇప్పుడు నా చేతినిండా డబ్బే డబ్బు. కాని అమ్మా, నాన్న లేరు! ఎప్పుడో, ఏనాడో నేను కలెక్టరు ట్రయినింగులో వుండగానే వాళ్ళిద్దరూ కన్ను మూసారు!.

(This story was published in Navya weekly)

Thursday, July 22, 2010

ఈ గుండె పిలుపు

ఈ గుండె పిలుపు ఓ వేలుపూ
నీకందేనా లేక, ఇలవేలుపూ
ఈ జీవి చరితము ఇక ముగిసేనా ?

హరిత దళముల సవ్వడి
విని, నీవస్తివని వడి వడి
ఘడియ ఘడియకూ తడబడే
ఈ గుండె పిలుపు నీకందేనా?

తనువు వల్లరి, సరి, సరి
మోవి ఆపై ఒక విరి
పరిమళాలకు నోచలేదు
ప్రణయ ఖేలన కోర లేదు
చషకమందున విషము నింపి
గుండె గతులను నిలిపివేసి
ముక్తి నిమ్మని మోకరిల్లే
ఈ గుండె పిలుపు నికందేనా?

ఇది ఉషస్సు పాడిన గీతం

ఇది ఉషస్సు పాడిన గీతం
మరి తమస్సు రాదని భావం

చల్లని సిరివెన్నెల మనసంతా నిండింది
ఆరెడు చిరుదివ్వెకు ఊపిరిగా నిలిచింది

మోడై మిగిలిన మదిలో ఆమని
మరి ఇక పోనని బాసట లిడుకొని
నవ్వుల తొలకరి చిలికింది
వలపుల విరివని వేసింది

వాడిన విరులకు తావుల నొసగి
ముసిరిన ఇరులను తొలగగ జేసి
హరివిల్లు వలె వెలిగింది
సరిజోడై తా నిలిచింది

Wednesday, July 21, 2010

రక్తి - భక్తి

రాతిలో పరమాత్మ కొరకు
కొండలు, వాగులు కోరి చేరే భక్తులు
నాతిపై అనురక్తితో
ఇడుముల, ఇరుకుల సరగు చేయని రక్తులు
ఈ ఇరుతెగలలో ఏమిటి భేదం?
చివరకు మదిలో మిగులును ఖేదం

ఏడు కొండల నెక్కబోవగ

దారిలో దోపిడులు
ఏడు అడుగులు కలిసి నడువగ
ఎడదలో రాపిడులు
రాతినే పూజింతురా
నాతికై తపియింతురా
జాతికంటిన జాడ్యమిది
అని యెంతురా?

మొక్కు తీర్చిన క్షణము నందే
పాపములు బాయునా
చెక్కు నొక్కిన, చెలిని కూడిన
తాపములు తీరునా?
ఏది క్షణికము? ఏది అమరము?
ఎంచి చూడగ వెర్రిదనము

రాతి పైన, నాతి పైన
భక్తి రక్తులు ఏలరా
సాటి జనులకు సాయమొసగక
వేల్పు కొరకో, చేటి కొరకో
అంగలార్చుట వెర్రి కాదో
?

విన్నపం

వేణువు నూదరా గోపాలా

ఇహ వ్యామోహము వదలునటుల నీ

సరిగమప అను ఆరు స్వరమ్ముల
ఆరు వైరులను అంతము చేసి
ని అను సప్త స్వరమ్మున
నిష్కామమ్మును కలుగగ జేసి
నాద సాధనతో మోక్ష సాధనకు
మార్గము సుగమము జేయర గోపాలా

నాద మునీంద్రుడు త్యాగరాజుకు
రామ భక్తుడు శ్రీ రామదాసుకు
వాగ్గేయకారుడు పురందర దాసుకు
భారత రత్న బిస్మిల్ల ఖానుకు
ముక్తి పథమ్మును జూపిన ఘనుడవు గోపాలా

గీతము తెలియదు సంగీతము తెలియదు
నీ వేణునాదము ఎడద వీనులతొ
వనుచుంటినయా మీగడ చోరా
బెగడ రాగముతో వై
రాగ్యము నీయవయా గోపాలా

తానమాడెడు తరుణమందున
గోపిక లందరి వలువల దాచి
నేను అన్నదే మిథ్యని తెలిపి
అహమును బాపి ముక్తిని యిడితివి గోపాలా

చిన్నదిగానే అగపడు కోరిక
అతి పెద్దదని నీకూ ఎరుక
శ్వాసను వదిలెడి ఘడియలనందు
నీ నామమునే తలుపగ చేయరా గోపాలా

జీవన వనమున మతి మాలి తిరిగితి
ఆకలి నిద్రల ఇతర వాంఛల
మతి మాలితిని, నిను మరచితిని
అనాయాసముగ నిన్ను చేరనీ గోపాలా


పూల దారులు

జీవా! ఓ జీవా!

ఎన్నెన్ని దారులో
అన్ని పూల దారులే
ఏదారికే గమ్యం
తెలుసుకొనుట నీ ధర్మం

ఇదో ఇదో ఓదారి
సంపెంగ పూదారి
ఈ దారి సాగేవో
కామమ్ము కలిగేను
కోర్కేలెన్నో రగిలేను
ఈదారికంతు లేదు
నీ యాత్ర ఆగబోదు
ఇహమందు మోజు పోదు
ఇక శాంతి నీకు రాదు

ఇదో ఇదో ఓ దారి
మందార పూదారి
ఈ దారి సాగేవో
క్రోథమ్ముకలిగేను
తామసము పెరిగేను
ఈ దారి సాగినంత
కలిగేను నీకు చింత
నీకిట్టి దారి వెంట
తోడెవ్వరుండరంట

ఇదో ఇదో ఒక దారి
గులాబి పూదారి
ఈ దారి సాగేవో
లోభమ్ము కలిగేను
క్షోభలెన్నో పెరిగేను
ఈ దారి నడిచినంత
కలిగేను నీకు వంత
ఆవంత సుఖము లేదు
కడకైన దుఃఖము పోదు

ఇదో ఇదో ఒక దారి
దవనాల పూదారి
ఈ దారి సాగేవో
మోహమ్ము కలిగేను
తాపమ్ము పెరిగేను
ఈ నడక ముగియబోదు
స్మృతీ ఇంక కలుగ బోదు
ఇహమందు దుఃఖము మిన్న
పరమన్న ధ్యాస సున్న

ఇదో ఇదో ఓ దారి
ఇప్పపూవుల దారి
ఈ దారి సాగేవో
మదమది కలిగేను
అహమది పెరిగేను
ఈ దారి మాదకమ్ము
ఉన్మాద ప్రేరకమ్ము
ఈ మత్తు వదలబోదు
గమ్యమ్ము చేరనీదు

ఇదో ఇదో ఒక దారి
మొగలి పూవుల దారి
ఈ దారి సాగేవో
మాత్సర్య మొదవేను
మిన్నాగులెదురౌను
ఈ దారి భీకరమ్ము
అశాంతి కాకరమ్ము
సంతృప్తి కలుగ బోదు
ఉన్ముక్త మవగ నీదు

ఇది వేరొక దారి
రాలు రప్పల దారి
ఈ దారి సాగేవో
భక్తీ భావమొదవేను
వైరాగ్య మేర్పడును
తాపసులు నడచు దారి
సాధకుల దిదియె దారి
జ్ఞానమ్ము నిచ్చు దారి
మోక్షమ్ము నిడెడి దారి

ఎన్నెన్ని దారులో
అన్ని పూల దారులే
అన్ని దారుల గమ్యం
అంతా అయోమయం
ఇది వేరొక దారి
రాలు రప్పల దారి
కాని గమ్యమున్నది
ఆత్మైక్య సారమిది

జన్మమో జన్మ రాహిత్యమో
గమ్యమును ఎంచుకో
ఆత్మను పరమాత్మలో
ఐక్య మొనరించు కో





రారా నా ప్రియతమా!

రారా నా ప్రియతమా
నా దరహాసపు వాసంతమును
ఇమ్మని వేడితిని
నా పాపిట సిందూరముపై
ప్రమాణమిడితిని రారా

మౌనముగా నేనుండజాలను
మూగ వేదనను తెలుపగ లేను
నీ ప్రితిపాత్రను కాని నాతిని
నాకు నేనే పరాయినైతిని రా రా

జాబిలి అలుగునా పున్నమి పైన
అలుక ఏలరా ఎలనాగ పైన
కొడిగట్టిన చిరు దీపమునైతిని
హరివిల్లు దరి అంథురాలిని

అశ్రు సుమమ్ముల గీతమాలికను
విరహ గీతికల రాగమాలికను
శ్రావణ మాసపు మేఘమాలికను
నను దహియించెడికాటికేలికను




హరా! హరా!

అహరహం ఇహంలో హాలాహలం
హరా హరా అనుకుంటే పీయూషం
ఇహం పైన వ్యామోహం వదులుకుంటే
అహం వీడి నిను నివు తెలుసుకుంటే
అనుక్షణం ఉల్లాసం, ఇహమందే కైలాసం ||

మూడు పుండ్ర ములు ధరియించు
మూడు తాపములు హరియించు
భుజగ భూషణుని నుతియుంచు
ఆరు వైరులను వధియించు
నగజాధీశుని శరణు గొను
సంచిత పాపం హరణమను ||

శివా శివా అని స్మరియించు
హృదయం పావన మొనరించు
నీలకంఠుని ధ్యానించు
లీలగా మోక్షం లభియించు
భూతంలో నీవేమి చేసినా
భూతనాదుడే భావి కాచెను ||

Monday, July 19, 2010

ఎటు పోతోంది దేశం?

ఎటు పోతొంది దేశం?
ఆలోచించూ నేస్తం!
చుట్టూ చీకటి, మదిలో చీకటి
వెలిగించూ చిరు దీపం!

విద్యార్థులమని అంటారు
కళాశాలలకు వస్తారు
సమ్మెలు చేస్తూ ఉంటారు
చదువుకు నామం పెడతారు

ప్రజా సేవకులమంటారు
ప్రభుత్వ సంస్థల నుంటారు
లంచాలను తెగ మేస్తారు
నీతికి గంతలు కడతారు

ప్రజా నాయకుల మంటారు
ఎన్నిక లెన్నిక లంటారు
ఓట్లకు నోట్లను ఇస్తారు
భ్రష్టులే నాయకులవుతారు

గంగా యమునలు పారేటి
ధర్మ భూమి యని అంటారు
ధర్మో రక్షతి రక్షితః
ఈ సూత్రం తెలియక వున్నారు

Sunday, July 18, 2010

అల్లా, హరి, యేసు

అల్లా, హరి, యేసు
నాకేమి తెలుసు?
అందమైన చెలి మనసు
పొందు టకె నా తపసు

ఒక్కడైన దేమునికి వేరు వేరు ప్రతిమలు
వేరు వేరు దేశాల్లో వేల కొలది నామాలు
చక్కనైన నా చెలిలో వింత వింత అందాలు
వింత వింత చందాల్లో సోయగాల బంధాలు

పదునాలుగు లోకాలను పాలించే రాజట
నూటెనిమిది నామాలతో ఆ దొరకు పూజట
నా పేద హృదయంలో కొలువున్న దేవతకు
ఏడేడు స్వరములతో రాగ పూజ చేతును

ధూపాలతో దీపాలతో దేవుని కారాధన
జపతపాలు దీక్షలతో ముక్తి కొరకు సాధన
మమకారం చిరు దీపం, వలపే హరిచందనం
గీతాలతో నా చెలిని అర్చింతును దినం దినం

మేఘావృతం

ఆకాశం మేఘావృతం
నా ఎదను రాగామృతం
చెలీ, చెలీ, నేమలులు ఆడే వేళ ఇది,
సఖీ, సఖీ, వలపులు పండే కాలమిది

మోవి మోవిపై ఆనిన వేళ
కాలము కదలక ఆగిన వేళ
తలపుల దివికే ఏలిక నీవై
వలపుల విరివని పాలిక నీవై
మనసులో కనులలో
నీవే, నీవే నిండిన వేళ

మనసు మనసుతో పలికిన వేళ
వయసు వయసుతో కులికిన వేళ
మదిలో నిండిన దేవత నీవై
నా పూజలందే వేలుపు నీవై
తలపులో, చూపులో
నీవే, నీవే నిండిన వేళ



Saturday, July 17, 2010

కోరికల తారకలు

తారకలు! తారకలు!
అందరాని తారకలు!
కోరికలు! కోరికలు!
తీరబోని కోరికలు!
అందరానివి, తీరబోనివి,
గుండె మిన్నులో ఏల వున్నవి?

అంధ పాంధుడా, సుంత ఆగరా
అలుపు దీర్చే నెలవు కలదురా
అలుపు దీరును, సేద పోవును
ముక్తి కవుగిలి సుతి మెత్తనైనది

ఈ ఎడారిలో గమ్యమేదిరా
ఎంత సాగినా వంత పోదురా
ఇసుక దారిలో సుకము లేదురా
కోర్కె విడువరా, ఆర్తి పోవురా

వినిపింపుమా దేవా

వినిపింపుమా దేవా నీ వేణు రవళి
రవళి - రవళి - మురళీ రవళి
భళీ భళీ

యమునా తటమున-బృందా వనమున
రాసలీలలు సలిపే గోపాలా
దయ రాదేలా
రట్టు సేయకు రగడ సేయకు జగడమాడకు
ఈ రాధ నీదేనురా

నీ సన్నిధినే నిరతము కోరే
బేల కేలును విడకు
గోపాలా ఇక జాగేలా
పంతమేలరా చెంత జేరరా పొందు నీయరా
ఈ రమణి నీదేనురా

Wednesday, July 14, 2010

బేసి కన్నుల దొర

వలిమల పైన సొగసుగ చెలగే దొర నా దొరా
కలియుగ బాధల కుములుచు వేగే నాదు వెతలను వినవా నా దొరా

పగలంత కూటికై ఆరాటము
రేయేమో కోరికల చెలగాటము
నిముసమ్ము నిను తలువ నిలుకడ లేదు
నిఖిలెస నీ దయకు యోగ్యత లేదు

ఎడద సవ్వడులు ప్రతి ఒక ఘడియ
మృత్యు యాత్రలో పద ధ్వనులాయెను
తొండపు వేలుపు తండ్రీ, నీ దయ కలుగక
బ్రతుకే గండమాయెను

స్మరణము చేతనే తరణ మిడుదువని
హర హర యనగనె భవ భయ హరమని
నిను ధ్యానిం తును శివం శంకరం
త్వమేవ శరణం మమ దేహి అభయం

Saturday, July 10, 2010

పావనా - పవన సూన

పావనా = పవన సూనా
నను కావవా

దశరథ తనయుని సేవకు నోచిన
ధీశాలి నను కరుణింపవా

జలధిని దాటుట మేలము నీకట
లక్ష్మణ రక్షణ మూలము నీవట
వాయునందనా - లంఖిణిసూధనా
బంధ విమో చన - నా బాగ్య నిధాన కరుణింపవా

సీతా మాతకు సాంత్వన దాతవు
శ్రీరామునకు ధర్మ భ్రాతవు
రామచంద్రుడే కోరెను సాయము
నేనెంత స్వామి - రజము ప్రాయము కరుణింపవా

Thursday, July 8, 2010

Astrology

Want to have your birth chart, Planetary dashas and anthardashas? Want to know your future? If you have faith, you may contact me.

ఆత్మహంస

ఎగురుకుంటూ పోతున్నాయి విహంగాలు గగనంలో
ఏలా ఈ ఆత్మహంస ఎగురకుంది తనువొదిలి


పక్షము లొదవిన తక్షణమే ఇక
పక్షులేగురునే వియత్తలంమున
పక్షములెన్నో వయసుకు చేరెను
కమలాక్షా , నీ కక్ష ఏటికో
పరమాత్మా, ఈ ఆత్మను చేదుకో

ఘడియ ఘడియకు బోయలారుగురు
శరములనేన్నో దూస్తూ వుంటే
తడవ తడవకు తాపము పెరిగెను
తనువు పైననే తామసమాయెను
పరమాత్మా, ఈ ఆత్మను పిలుచుకొ

పురుషార్థమ్ముల అర్థకామముల
ధ్యాసయే కాని ఇతరము లేదు
జివితమనగా ముగియని కథగా
వెతలను పెంచెను, వేధను గూర్చేను

పరమాత్మా, ఈ ఆత్మను కలుపుకో